పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తితో పాటు, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు అనుచరులకు గుంటూరులోని న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 10వ తేదీన గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కిరణ్ కుమార్‌పైన, అలాగే అక్కడే ఉన్న ఎస్కార్ట్ పోలీసు సిబ్బందిపైన గోరంట్ల మాధవ్, ఆయనకు చెందిన ఐదుగురు అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే రోజు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరుసటి రోజు గోరంట్ల మాధవ్‌తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం, కోర్టు అనుమతితో ఈ నెల 23న మాధవ్‌ను పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం 24న తిరిగి ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు.
మరోసారి మాధవ్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, మాధవ్ తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న గోరంట్ల మాధవ్‌తో పాటు మిగిలిన ఐదుగురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరై రిజిస్టర్‌లో సంతకం చేయాలని కోర్టు షరతు విధించింది. అవసరమైన పూచీకత్తులు సమర్పించిన తర్వాత, ఈరోజు వారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.