తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పలు నెలలు గడుస్తున్నా, మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లోనూ, పదవులు ఆశిస్తున్న నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న ఊహాగానాలు వినిపించినా, చివరి నిమిషంలో ప్రక్రియ నిలిచిపోవడంతో ఆశావహుల్లో నిరీక్షణ తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా కేబినెట్ విస్తరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇది పూర్తిగా ముఖ్యమంత్రి, ఏఐసీసీ అధిష్ఠానం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని అన్నారు. విస్తరణ సమయంలో అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, కులగణన ఫలితాలకు అనుగుణంగా విస్తరణ జరగాలని అభిప్రాయపడ్డారు.