సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో శుక్రవారం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే మార్గాలపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా పోకుండా అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమావేశం అనంతరం జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ, “మోదీ ప్రభుత్వం తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైనది, పూర్తిగా దేశ ప్రయోజనాలకు అనుగుణమైనది. సింధు నది నుంచి చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా చూస్తాం” అని స్పష్టం చేశారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ బుధవారం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజాకు అధికారికంగా లేఖ రాశారు. ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు.
గతంలో 1960 నాటి సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 12(3) ప్రకారం, మారుతున్న పరిస్థితుల (భారీగా పెరిగిన జనాభా, స్వచ్ఛ ఇంధన ఆవశ్యకత, నీటి పంపకాలకు ఆధారమైన ప్రాథమిక అంచనాలలో మార్పులు) దృష్ట్యా ఒప్పందంపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ భారత్ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని లేఖలో గుర్తుచేశారు. పాకిస్థాన్ పదేపదే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తోందని, దీనివల్ల ఏర్పడిన భద్రతాపరమైన అనిశ్చితి కారణంగా ఒప్పందం ప్రకారం తమ హక్కులను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని భారత్ పేర్కొంది. చర్చల కోసం భారత్ చేసిన విజ్ఞప్తులకు పాకిస్థాన్ స్పందించకపోవడం కూడా ఒప్పంద ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. లోతైన పరిశీలన తర్వాతే ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖర్జీ తన లేఖలో వివరించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికల్లో భాగంగా, సింధు, జీలం, చీనాబ్ నదులపై ఉన్న డ్యామ్‌లలో పూడిక తీసి, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. జీలం ఉపనదిపై నిర్మిస్తున్న కిషన్‌గంగ, చీనాబ్ ఉపనదిపై నిర్మాణంలో ఉన్న రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరాలను ఇకపై భారత్ పట్టించుకోకపోవచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ నదులపై కొత్త డ్యామ్‌లు, మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా పరిశీలనలో ఉంది.
ఈ నిర్ణయంపై ప్రపంచ బ్యాంకు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఒత్తిడి వస్తే ఎదుర్కొనేందుకు న్యాయపరమైన వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ ఈ చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇతర దేశాలకు వివరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.
మరోవైపు, ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. “సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం, పూర్తిస్థాయి జాతీయ శక్తితో ప్రతిస్పందిస్తాం” అని పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై భారత్‌కు పూర్తి హక్కులు లభించగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలను వాడుకునే హక్కు పాకిస్థాన్‌కు దక్కింది.