AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పహల్గాం ఉగ్రదాడి.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘ఆక్రమణ్’ విన్యాసాలు..

భారత వైమానిక దళం తన సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలకమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘ఆక్రమణ్’ పేరుతో సెంట్రల్ సెక్టార్ పరిధిలోని విస్తారమైన గగనతలంలో భారీ వైమానిక విన్యాసాలను నిర్వహిస్తోంది. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఈ కసరత్తులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

 

దేశ రక్షణలో కీలకమైన భారత వైమానిక దళం, తన కార్యాచరణ సంసిద్ధతను పరీక్షించుకునేందుకు ‘ఆక్రమణ్’ విన్యాసాలను చేపట్టింది. రఫేల్‌తో పాటు వాయుసేన అమ్ములపొదిలోని ప్రధాన యుద్ధ విమాన శ్రేణులు ఈ కసరత్తులో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాల కోసం తూర్పు వైపున ఉన్న స్థావరాలతో సహా పలు వైమానిక కేంద్రాల నుంచి వాయుసేనకు చెందిన సాధన సంపత్తిని, యుద్ధ విమానాలను తరలించినట్లు రక్షణ రంగ వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ యుద్ధ విమానాలు అత్యంత క్లిష్టమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా భూతలంపై కచ్చితత్వంతో దాడులు చేయడం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డ్రిల్స్ వంటి సంక్లిష్టమైన కార్యకలాపాలను ఈ విన్యాసాల్లో భాగంగా సాధన చేస్తున్నట్లు వివరించాయి.

 

మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు వంటి విభిన్న భౌగోళిక పరిస్థితులలో క్లిష్టమైన భూతల దాడి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారత వైమానిక దళం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ ‘ఆక్రమణ్’ విన్యాసాలు దోహదపడతాయని భావిస్తున్నారు.

 

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఎయిర్ డ్రిల్ జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ANN TOP 10