ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, కాపు నేత హరిరామ జోగయ్య ఈరోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై ఓ కీలక అంశాన్ని ఆయన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
డీఎస్సీ నియామకాల్లో 103 రాజ్యాంగ సవరణ ప్రకారం షెడ్యూల్-14 చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో 10 శాతం అగ్రవర్ణాల్లోని ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆ విషయంలో ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో కాపులకు డీఎస్సీ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పించి కాపు సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలని హరిరామ జోగయ్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కోరారు.