ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే వారిని.. ఎక్కడ దాగున్నా కనిపెడతాం.. భూమి అంచుల వరకు వెంబడిస్తాం.. వెతికి మరీ.. వారికి ఊహకు అందని శిక్ష విధిస్తాం.. అంటూ కశ్మీర్ నరమేధ ముష్కరులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి.. ఉగ్రవాద నాయకుల వెన్నెముకను విరిచేస్తుందంటూ.. టెర్రరిస్టులు వెన్నులో వణుకు పుట్టించేలా మాట్లాడారు మోదీ.
పాక్‌కు డైరెక్ట్ వార్నింగ్
పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులపై యావత్ దేశం రగిలిపోతోంది. వారిని కఠినంగా శిక్షించాలని.. వారి వెనుక ఉన్న పాకిస్తాన్ పని పట్టాలని కోరుతోంది. రెండు రోజులుగా స్ట్రాటజిక్ మీటింగ్స్‌తో బిజీగా ఉన్నారు ప్రధాని మోదీ. పాక్‌తో సింధూ జలాల ఒప్పందం రద్దు చేశారు. పాకిస్తాన్ పౌరులంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇలా విధాన పరమైన కౌంటర్ అటాక్స్ తర్వాత.. తాజాగా బీహార్ గడ్డ మీది నుంచి డైరెక్ట్‌గా ఉగ్రవాదులకు, పరోక్షంగా పాకిస్తాన్‌ను గట్టి హెచ్చరికలు చేశారు మోదీ. ఆగ్రహంతో, ఆవేశంలో ఊగిపోతూ.. టెర్రరిస్టులు ఏ మూలన దాగున్నా వెంటాడి వేటాడుతామని ఛాలెంజ్ చేశారు. ప్రతీ ఉగ్రవాదిని గుర్తించి.. ట్రాక్ చేసి.. శిక్షిస్తామని భారతీయులందరికీ హామీ ఇచ్చారు మోదీ.
బాధితులకు మోదీ భరోసా
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెప్పారు. బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని.. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ర్యాలీలో పాల్గొన్నారు. 2 నిమిషాలు మౌనం పాటించారు.
సర్జికల్ స్ట్రైక్స్ 2 కు హింట్ ఇచ్చారా?
ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న భూమిని ఊడ్చేస్తాం అంటూ.. పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టేనని అంటున్నారు. అంటే, సర్జికల్ స్ట్రైక్‌ను మించిన యాక్షన్ ఏదో త్వరలో జరగబోతోందంటూ హింట్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదుల్ని చంపేస్తామని అనడం కామనే కానీ.. ముష్కరుల మూలాల్ని నాశనం చేస్తామని చెప్పడం వెనుక పక్కా వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయడంతో.. భవిష్యత్తులో పాకిస్తాన్ ఎడారిలా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆలోగా పీవోకేపై దాడి చేయడం లాంటి యాక్షన్ ప్లాన్ ఏదైనా అమలు చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు భారతీయులంతా. మోదీ మాటలు అలానే అనిపిస్తున్నాయని అంటున్నారు.