కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక దాడితో దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక పహల్గామ్ ఉగ్రదాడి దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ దళాలు, కశ్మీర్ పోలీసులు, పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దేశ ప్రజలు ఉగ్రవాదులపై ఫైరవుతున్నారు. వారిని ఎక్కడున్నా దొరకపట్టి కఠినంగా శిక్షంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ దళాలను కోరుతున్నారు.
అయితే కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి మరవక ముందే పాకిస్తాన్ మరో దుందుడు చర్యకు దిగింది. భారత్ కు చెందిన ఓ జవానును పాక్ బంధీగా చేసకుంది. 182వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్, పాకిస్థాన్ సైన్యం చేతిలో బంధీ అయినట్టు భద్రతా బలగాల అధికారులు వెల్లడించారు. జవాన్ పీకే సింగ్ తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అయితే పాక్ వ్యాఖ్యలను BSF అధికారులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు.
జవాన్ పీకే సింగ్ సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం బంధీగా చేసిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా జవాను పీకే సింగ్ ను విడుదల చేయాలని, లేదంటే తగిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడితో ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాక్ ఇలాంటి చర్యకు పాల్పడటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావొచ్చునేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.