AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనతా గ్యారేజ్ లా తెలంగాణా భవన్: కేటీఆర్ ..

తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారిందని, ప్రజలంతా గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని బిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజలను రెచ్చగొట్టడం కోసమో, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం కోసమో కాదని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు జరుపుకునే వేడుక మాత్రమేనని ఆయన అన్నారు.

 

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో పర్యటించిన ఆయన బిఆర్ ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం దగ్గర జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు .అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత బీఆర్ఎస్ దేనని పేర్కొన్నారు.

 

బిఆర్ఎస్ చరిత్రలోనే ఇది భారీ బహిరంగ సభ

వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నాం అని మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వరంగల్ వేదిక అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ అని, ప్రజలంతా గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్న భావనలో చూస్తున్నారని, తెలంగాణా భవన్ జనతా గ్యారేజ్ లా మారింది అన్నారు. బి ఆర్ ఎస్ చరిత్రలోనే ఇది భారీ బహిరంగ సభ కాబోతుందని కేటీఆర్ వెల్లడించారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, సభకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 40 వేల వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.10లక్షల వాటర్ బాటిల్స్, 10లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నామని, ఏ వైపు నుంచి వచ్చిన వాహనాల కైనా సరే ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఉంటుందని అన్నారు. దాదాపు 100 మంది డాక్టర్ల టీమ్ ను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ANN TOP 10