AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నరమేధానికి కారకులైన ఎవ్వరినీ వదిలిపెట్టం..! కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

భారతావనికి హామీ ఇస్తున్నాం.. నరమేధానికి కారకులైన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హత్యాకాండకు ధీటుగా బదులిస్తామని.. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతకంతకు దెబ్బకొడుతుందని హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను టార్గెట్ చేశారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. పహల్గాం ఘటన, కశ్మీర్‌లో భద్రతా చర్యలపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిలతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు.

 

కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులు

 

జమ్మూ కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు దాగున్నారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారి కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది. ఆ 56 మందిలో 35 మంది లష్కరే తోయిబా ముష్కరులే. 18 మంది జైషే మహమ్మద్ టెర్రరిస్టులు.. ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం.

 

ఎయిర్‌పోర్టులో టూరిస్టుల రద్దీ

 

పహల్గాంలో టెర్రర్ అటాక్‌తో కశ్మీర్‌లో పర్యటిస్తున్న టూరిస్టులు హడలిపోతున్నారు. ఇప్పటికే వేలాది మంది పర్యాటకులు కశ్మీర్ టూర్‌లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఉగ్రదాడి తర్వాత 3వేల మందికి పైగా టూరిస్టులు కశ్మీర్‌ను వీడారు. వారి కోసం శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతోంది కేంద్ర ప్రభుత్వం. బుధవారం మధ్యాహ్నం కల్లా 20 విమానాల్లో.. 3,337 మంది పర్యాటకులు శ్రీనగర్‌ను వీడినట్టు కేంద్ర విమానయాన సంస్థ ప్రకటించింది. ఉగ్రదాడిని ఖండించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. కశ్మీర్ నుంచి టూరిస్టులు వెళ్లిపోవడం బాధాకరమైన విషయమని జమ్మూకశ్మీర్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10