పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్‌గా మారణహోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.
అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్ పోస్టును కూడా వెంటనే నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక పాక్ పౌరులను భారత్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
సింధు జలాల ఒప్పందం ఏంటి..?
సింధు జలాల ఒప్పందం భారత్, పాక్ దేశాల మధ్య నదీ జలాలకు సంబంధించిన ఒప్పందం.ఇది 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాల మధ్య నీటి పంపిణీ ఎలా చేయాలనే దానిపై నిర్ణయించింది. 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు యూజీన్ బ్లాక్ అధ్యక్షత వహించారు.
సింధు నదికి ఐదు ఉపనదులు ఉంటాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులు. ఇందులో దిగువన ఉన్న జీలం, చినాబ్, సింధు జలాలను పాకిస్థాన్ దేశానికిక కేటాయించారు. ఎగువ ఉన్న నదులు రావి, బియాస్, సట్లెజ్ను భారత్ అధీనంలో ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులను మినహాయిస్తే తప్ప.. ఎగువ నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ ఎలాంటి నిల్వ కానీ, నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించేందుకు వీలులేదని ఈ ఒప్పందం వివరిస్తుంది.
సహకారం కోసం శాశ్విత కమిషన్ ఏర్పాటు..
ఈ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్విత కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాలను ఈ కమిషన్ చూసుకుంటుంది. రెండు దేశాల కమిషనర్లు ఏటా రెండు సార్లు సమావేశం అవుతారు. నదులపై కొనసాగుతున్న ప్రాజెక్టులను పర్యటించి తనిఖీలు నిర్వహిస్తారు. సింధు జలాల ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు పాత్ర పరిమితంగా మాత్రమే ఉంటుంది. విధానపరమైన బాధ్యతలనే మాత్రమే చూస్తుంది. ముఖ్యంగా ఏవైనా విభేదాలు తలెత్తిన సమయంలో ఇరు వర్గాలు కోరినప్పుడే ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంటుంది.
దిగువన ఉన్న నదులైన సింధు, చీనాబ్, జీలం నదులు పాకిస్థాన్ దేశానికి జీవనాధారం. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే పాక్ పూర్తిగా డిపెంట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ భారత్ ఈ నదుల ప్రవాహాన్ని నిలిపేస్తే పాక్కు తీవ్ర సమస్యలు ఏర్పడుతాయి. చీనాబ్, జీలం నదులు భారత్ లో ఉద్భవిస్తాయి. చైనాలో పుట్టిన సింధు నది భారత్ గుండా పాకిస్థాన్ లోకి ప్రవహిస్తుంది.
అయితే, కశ్మీర్, పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.