తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇందిరమ్మ ఇళ్లు. దీన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఏ మాత్రం అవకతవకలకు చోటు ఇవ్వకుండా చర్యలు చేపడుతోంది. సమయం తీసుకున్నా, విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల గుర్తింపునకు ప్లాన్ ప్రకారం వెళ్తోంది.
ఈ క్రమంలో ఈ నెల(ఏప్రిల్) 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. ఈ మేరకు పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయనుంది. కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఏప్రిల్ 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నది ఆలోచన.
టార్గెట్ ఏప్రిల్ 30లోపు
28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనుంది. మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి లక్ష రూపాయలను విడుదల చేయనుంది. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు.
ఏప్రిల్ 30 లోపు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం తగిన సహకారం అందించాలన్నారు. మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి
పేదవాడు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఇవ్వనుంది. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. అలాగే ఇళ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు సదరు మంత్రి.
ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు మంత్రి. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఉండాలన్నారు. అలాగే 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తారు అధికారులు.
లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఇదేక్రమంలో కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వాటిలో ఆదిలాబాద్, జగిత్యాలలతోపాటు 11 జిల్లాల్లో ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఆశించినంత స్థాయిలో లేదన్నది మంత్రి మాట.