మాజీ మంత్రి విడదల రజని మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి.. వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపనలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గోపి ఏ-3గా ఉన్నారు.
గెలిచిన తొలిసారే.. ఎమ్మెల్యే ఆపై మంత్రి పదవి కూడా కొట్టేసిన రజనీకి సడెన్ స్టార్‌గా పేరుంది. ఎంత తక్కువ కాలంలో ఎదిగారో అంతే తక్కువ కాలంలో ఆమెపై అనేక రాజకీయ ఆరోపణలు. ఉన్న చోటు వదిలి గుంటూరు వెస్ట్ కి తట్టాబుట్టా సర్దుకెళ్లింది ఇందుకేనంటారు. అక్కడేదైనా గెలిచారా? అంటే అదీ లేదు.. వెళ్లినంత సేపు కూడా ఉండలేక పోయారు. ఆ వెంటనే రిటనై పోయారు. సరే ఇలాగైనా పేటలో ఏ పోరూ లేకుండా ప్రశాంతంగా ఉన్నారా అంటే అదీ లేదు.. ఆ ఆశ కూడా అడయాశలై పోతున్నాయట రజనీమేడంగారికి.
కాస్తయినా గ్యాప్ ఇవ్వండ్రా! అనే బ్రహ్మీ డైలాగ్ తో రజనీ మేడంపై మీమ్స్ ఒకటే పేలుతున్నాయట. కారణం ఆమెపై వరసగా నమోదవుతున్న ఫిర్యాదులు అలాంటివి మరి. జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ వ్యవహారమే తీసుకుంటే.. రైతుల నుంచి కమీషన్ల పేరిట డబ్బు వసూలు చేశారట. కొందరు కంప్లయింట్ చేయడంతో.. డబ్బు తిరిగి ఇచ్చేశారట. దీంతో వీరు కేసులు వెనక్కు తీసుకున్నారట. కొందరు మాత్రం పట్టు వదలడం లేదట. తమతో పాటు మరికొందరు బాధితులను కూడా పోగేస్తూ.. రజనీ మేడంపైకి ఉసిగొల్పుతున్నారట. దీంతో రజనీ, ఆమె అనుచరులకు ఏం చేయాలో అర్ధంగాని అగమ్య గోచర పరిస్థితి నెలకొందట. బురద తొక్కనేలా కాలు కడగనేల అన్నట్టు ఆనాడు లంచాలు తీస్కోనేలా- ఈనాడు అవస్థ పడనేలా? అంటూ.. పాతసామెతల్నే కొత్తగా చెప్పుకుంటున్నారట.
ఇవన్నీ ఇలాగుంటే.. ఎన్నికల టైంలో రజనీ తన దగ్గర ఐదు కోట్ల రూపాయల డబ్బు తీస్కుని మోసం చేసిందంటూ.. సొంత పార్టీ నేత మల్లెల రాజేష్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ అంశం కలకలంగా మారింది కూడా. దీనిపై ఆనాడే రజనీ అనుచరవర్గం ఆందోళన చెందారు. ఈ ఆరోపణలు తన విజయానికి అడ్డు పడేలా ఉందని రజనీ వర్గం డైలమాలో పడింది కూడా. వీటన్నిటినీ తట్టుకుని.. గెలుస్తామంటూ ప్రగల్బాలు పలికినా.. ఓటమి తర్వాత అందరూ నవ్వుకున్నారట.
ఈ మధ్య కాలంలో.. రజనీపై పిల్లికోటి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి సుపరిచితమే.. దీంతో ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను స్టేషన్లు తీవ్రంగా వేధించారంటూ కోటీ చిలకలూరిపేట పీఎస్ లో కంప్లయింట్ చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు.. సీఐ రమేష్ పై కూడా కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు రజనీపై బాలాజీ స్టోన్ క్రషర్ కేసున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో నాడు విజలెన్స్ ఎస్పీగా చేసిన జాషువా, రజనీ బావమరిది గోపీనాథ్, పీఏ రామకృష్ణపైనా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా రిజిని మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ.
ఇలా ఒకదాని వెంట మరొకటిగా.. కేసులు వెంటాడటంతో.. సతమతమై పోతున్నారట రజనీ. ఇటు తనపైనే కాక, తన అనుచరులపైనా కేసులు బుక్ అవుతుంటే.. ఉక్కిరిబిక్కిరిగా ఫీలవుతున్నారట. పైకి ధైర్యం ఎదుర్కుంటానని రజనీమేడం మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఆమె గజగజ ఒణికిపోతున్నారని అనుచరులే అంటున్నారట. తాను మాత్రమే కాక తమను కూడా పీకలోతు కేసుల్లో ఇరికించేస్తున్నారనీ.. వీరు వాపోతున్నారట. ఆనాడు ఆమె చెప్పినట్టల్లా చేయడమే తమకు చేటు తెచ్చిందని.. వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
మొత్తం మీద పేటలో ఇన్నాళ్లూ అధికారం చెలాయించిన ఈ మాజీ మంత్రికి ప్రస్తుతం పేటరాప్ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. మరి చూడాలి రజనీ భవితవ్యమేంటో.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఫ్యూచరేంటో అంటున్నారు పేటవాసులు.