దేశ సమగ్రతను దెబ్బ తీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాల న్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో దేశమంతా సమైక్యంగా నిలబడాలన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల తూటాలకు బలైన రిటైర్డ్ బ్యాంకు అధికారి చంద్రమౌళి మృతదేహానికి విశాఖ వెళ్లి నివాళులు అర్పించారు. తొలుత చంద్రమౌళి కుటుంబసభ్యులు, ఆయన తోడల్లుడితో మాట్లాడారు సీఎం చంద్రబాబు.
చలించిన సీఎం చంద్రబాబు
ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు కలిశారు. ఈ ప్రాంతం నుంచి కాశ్మీర్‌కు ఎంత మంది వెళ్లారు అనేదానిపై ఆరా తీశారు. అక్కడివారు చెప్పిన సమాచారం వివరాలు నమోదు చేసుకున్నారు. చంద్రమౌళి పార్ధివదేహం పేటికపై జాతీయ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడి భార్య నాగమణి, ఆమె చెల్లెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సన్నివేశానికి ముఖ్యమంత్రి చలించిపోయారు.
ఉగ్రదాడికి నిరసనగా విశాఖలో చేపట్టిన శాంతి ర్యాలీలో సీఎ చంద్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు మాట్లాడిన సీఎం చంద్రబాబు, దేశంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉందన్నారు. టెర్రరిస్టులు భారత్‌ను ఏమీ చేయలేరని మనసులోని మాట బయటపెట్టారు. ఇలాంటి ఘటనలతో అలజడి రేపాలని అనుకోవడం అవివేకమన్నారు.
అలాంటి శక్తులకు రిప్లై ఇద్దాం
దేశ సమగ్రతను దెబ్బతీయాలని భావించేవారికి గట్టిగా సమాధానం చెబుదామన్నారు. ప్రజలే పోలీసింగ్ చేయాలని, అప్పుడే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో కొన్ని శక్తులు దేశంలో అలజడి సృష్టించాలని కుట్ర పన్నినట్టు వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని తెలిపారు.
మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శాంతి ర్యాలీకి ముందు ఘటనా స్థలంలోవున్న ప్రత్యక్ష సాక్షి శశిధర్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు. పర్యాటక ప్రాంతానికి గుర్రాల సాయంతో చేరుకున్నామని తెలిపారు. ఈలోగా కొందరు వాష్‌రూంలకు వెళ్లాలని, ఇద్దరు దుండగులు నడుస్తూ కాల్పులు జరిపారని తెలిపారు. కొందరిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్చడం వంద మీటర్ల దూరం నుంచి చూశామన్నారు. రోజు జరిగిన భయంకరమైన పరిస్థితిని వివరించి కన్నీరు పెట్టాడు ప్రత్యక్ష సాక్షి.
బాధిత కుటుంబాలకు భరోసా
ఏపీలో సముద్ర తీరం భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. అనుమానం వచ్చినప్పుడు ప్రజలు బాధ్యతగా పోలీసు వర్గాలకు సమాచారం తెలపాలన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదనరావును పోగొట్టుకున్నామని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ఆ తర్వాత చంద్రమౌళి అంత్యక్రియలపై నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి చంద్రమౌళి మృతదేహాన్ని ఆసుపత్రిలోని ఓ ఫ్రీజర్‌లో భద్ర పరిచారు కుటుంబ సభ్యులు. గురువారం చంద్రమౌళికి శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.