AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక..!

లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, లగచర్ల భూసేకరణ వివాదంలో మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే విధుల్లోంచి తొలగించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ఈ ఘటనపై తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ మహిళా కమిషన్‌లను ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుబట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక తర్వాత అయినా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోని పక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

 

ఎన్‌హెచ్ఆర్సీ సూచించిన విధంగా ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. లగచర్లలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించినప్పటికీ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేటీఆర్ అన్నారు. దీనిని వెంటనే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10