ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గతేడాది నుంచి వార్తల్లో ఉంటున్నారు. దివ్వెల మాధురితో సాన్నిహిత్యం, పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు, ఇటీవల విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి అంశాలతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు.
అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్
మరో వైపు, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.