AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పహల్గామ్ దాడి తర్వాత మరో ఉగ్ర కుట్ర.. సరిహద్దుల్లో కాల్పులు..

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. మంగళవారం పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి తర్వాత గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన చినార్ కోర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ నాలా వద్ద సర్జీవన్ ప్రాంతం గుండా కొంతమంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.

 

వారి కదలికలను గుర్తించి అప్రమత్తమైన సైనిక బృందాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి భారీ పరిమాణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించడం, పలువురు గాయపడటం తెలిసిందే. ఈ ఘోరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే చొరబాటు యత్నం జరగడం గమనార్హం.

ANN TOP 10