పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జుట్ గా అధికారులు అనుమానిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైఫుల్లాను కరుడుగట్టిన తీవ్రవాదిగా గతంలోనే గుర్తించింది. పాక్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని లష్కరే స్థావరం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు.
పహల్గామ్ దాడికి సంబంధించి అధికార వర్గాల కథనం ప్రకారం.. సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులు తొలుత పర్యాటకుల గుర్తింపు కార్డులు అడిగారు. ముస్లింలు, ముస్లిమేతరులను గుర్తించేందుకే ఇలా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత పురుషులను వేరు చేసి, వారిపై 5 నిమిషాల పాటు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌కు చెందిన బుల్లెట్లతో పాటు కవచాలను ఛేదించగల బుల్లెట్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమాయక పౌరులు, పర్యాటకులపై జరిగిన ఈ దాడిని భారత సైన్యం పిరికిపంద చర్యగా అభివర్ణించింది.