AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పహల్గాం ఉగ్రదాడి… ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర భేటీ..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ నేప‌థ్యంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్ర‌ధాని మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భార‌త్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు. బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన మోదీ… ఎయిర్‌పోర్టులోనే అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించారు.

 

జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంక‌ర్‌, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీతో స‌మావేశ‌మై ఉగ్ర ఘ‌ట‌న‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి దాడి జ‌రిగిన తీరును వివ‌రించారు. కాగా, ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ స‌మావేశం కానుంది.

 

ఇక‌, ఇప్ప‌టికే శ్రీన‌గ‌ర్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా… భ‌ద్ర‌తా ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయి ప్ర‌స్తుత‌ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. ఇవాళ ఆయ‌న దాడి జ‌రిగిన ప‌హ‌ల్గాం ప్రాంతానికి వెళ్లి ప‌రిశీలించ‌నున్నారు.

 

క‌శ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై ఉగ్ర‌మూక‌లు పాశవిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా… మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10