మార్కెట్లోకి మళ్లీ కొత్తగా దొంగనోట్లు వచ్చేశాయి. ఈ దొంగనోట్లను అత్యాధునిక టెక్నాలజీ వాడి తయారు చేసినట్టు తెలుస్తోంది. అసలుకి, నకిలీకి ఏమాత్రం తేడా తెలియదు. రూ.500 నోటు అసలుని, నకిలీని పక్కపక్కనపెట్టి చూస్తే బ్యాంక్ సిబ్బంది కూడా కాసేపు తడబడాల్సిందే. హైసెక్యూరిటీ ఫీచర్స్ లో కూడా దాదాపుగా అసలు నోటుని మ్యాచ్ చేస్తూ నకిలీనోటు తయారైంది. ఇదేదో సోషల్ మీడియా పుకారు కాదు. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ బయటపెట్టిన నిజం. అవును దేశంలో రూ.500 నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని, ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అవి దాదాపు అసలు నోటుని పోలి ఉన్నాయని హెచ్చరించింది.
ఆ ఒక్కటి మిస్సైంది..
దొంగనోట్ల కొత్త సిరీస్ లో ఒక పొరపాటు జరిగిట్టు కేంద్ర హోంశాఖ గమనించింది. చలామణిలో ఉన్న నకిలీ నోట్ల సిరీస్ లో ఇంగ్లిష్ అక్షరాన్ని ముద్రించే క్రమంలో కేటుగాళ్లు తప్పు చేశారు. ఆ తప్పుతోనే ఆ నకిలీ నోటుని పసిగట్టవచ్చని కేంద్ర హోంశాఖ చెబుతోంది. నకిలీ నోటుని గుర్తించడంలో అదే కీలకంగా మారినట్టు తెలిపింది.
‘E’ బదులు ‘A’
మనం వాడే కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు ఆంగ్లంలో ముద్రించి ఉంటుంది. ఇంగ్లిష్ లో ఉన్న స్పెల్లింగ్ లో ‘E’ బదులు ‘A’ ని ప్రింట్ చేశారు. దీన్నిబట్టి అవి నకిలీ అని ఈజీగా గుర్తించే అవకాశముంది. ఈ స్పెల్లింగ్ తప్పు లేకపోతే వీటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. “RESERVE BANK OF INDIA” అనే వాక్యంలో ‘‘RESERVE’’ అనే పదంలో ‘E’ బదులు ‘A’ ముద్రించబడి ఉన్నట్టుగా కేంద్రం గుర్తించింది. ఈ చిన్న తప్పును మనం గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సిందే. ఈ నకిలీ నోట్ల విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, వివిధ ఏజెన్సీలను అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లోకి వచ్చేశాయని, వీటిని గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది.
నకిలీ నోట్లను గుర్తించడం ఎలా..?
భారత కరెన్సీ నోట్లపై 17 సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. అయితే వీటన్నిటినీ సామాన్యులు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. ఒకవేళ గుర్తున్నా.. ఏది నకిలీ ఫీచర్, ఏది అసలు ఫీచర్ అనే దగ్గర అయోమయంలో పడతారు. అయితే అన్నిటికంటే ప్రధానంగా గుర్తించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.
1. సెక్యూరిటీ థ్రెడ్..
నోటుని మన కంటికి కంటికి ఎదురుగా పెట్టుకుని చూస్తే అందులో సెక్యూరిటీ థ్రెడ్ కనపడుతుంది. అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నోటుని కాస్త వంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది. సెక్యూరిటీ థ్రెడ్ రంగులు మారిస్తే అసలు నోటు, ఒకే రంగులో కనపడితే మాత్రం నకిలీ నోటు అని గుర్తించాలి.
2. బ్లీడ్ లైన్స్..
ఇది ప్రత్యేకంగా దృష్టిలోపం ఉన్నవారికోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఫీచర్.. నోటుకి రెండువైపులా ఉబ్బెత్తుగా కొన్ని లైన్స్ ఉంటాయి. రూ.500 నోటుకి ఎడమవైపు 5, కుడివైపు 5 లైన్స్ ఉంటాయి. రెండువైపులా 4 లైన్లు ఉంటే అది రూ.100 నోటు. రెండువైపులా 4 లైన్లు ఉండి వాటి మధ్యలో రెండు చిన్న వృత్తాలు ఉంటే అది రూ.200 నోటు అని గుర్తించాలి.
3. ఇంటాగ్లియో ప్రింటింగ్..
అసలు నోటుకి నకిలీ తయారు చేయవచ్చు కానీ, దాన్ని ప్రింట్ చేసే విధానాన్ని మాత్రం కేటుగాళ్లు తస్కరించలేరు. అసలు నోటులో కొన్ని బొమ్మలు ఇంటాగ్లియో ప్రింటింగ్, అంటే రైజ్డ్ ప్రింటింగ్ లో ఉంటాయి. వాటిని మనం తాకితే కాస్త ఉబ్బెత్తుగా ఉన్నట్టు మన చేతికి అర్థమవుతుంది. గాంధీ బొమ్మ, అశోక స్తంభం, బ్లీడ్ లైన్స్ వంటివి ఇంటాగ్లియో ప్రింటింగ్ లో ఉంటాయి. నకిలీ నోట్లలో ఈ ప్రింటింగ్ అసాధ్యం.
4. వాటర్ మార్క్..
ఈ వాటర్ మార్క్ మనందరికీ తెలిసిన ఫీచర్. కరెన్సీ నోటు చివరి భాగంలో ఉన్న ఖాళీ ప్రాంతంలో వాటర్ మార్క్ ఉంటుంది. ఒకప్పుడు నకిలీల్లో వాటర్ మార్క్ ఉండేది కాదు, కానీ ఇటీవల కాలంలో అత్యాథునిక ప్రింటింగ్ టెక్నాలజీ వాడుతున్న కేటుగాళ్లు ఈ వాటర్ మార్క్ ని కూడా డూప్లికేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి.
5. లాటెంట్ ఇమేజ్..
కరెన్సీ నోటు ఎడమ వైపు కింద ఒక పట్టీ ఉంటుంది. ఆ పట్టీ లోపల ఆ నోటు విలువ అంటే 100, 200, 500 ఇలా ఆ సంఖ్యను ముద్రిస్తారు. అయితే ఆ పట్టీపై కాంతి పడితేనే ఆ సంఖ్య కనపడుతుంది. మామూలు సమయంలో అది కనపడదు. అందుకే దాన్ని లాటెంట్ ఇమేజ్ అంటారు.
నోటుపై స్వచ్ఛ భారత్ లోగో, 15 భాషల్లో దాని విలువ, తయారు చేసిన సంవత్సరం.. ఇలా మొత్తం 17 సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. వీటిలో పైన చెప్పిన 5 ఫీచర్లను సామాన్య ప్రజలు కూడా సులభంగా గుర్తించగలరు. మిగతా ఫీచర్లు కొన్ని నకిలీ నోట్లలో కూడా దాదాపుగా అలాగే కనపడటం ఆందోళన కలిగించే అంశం.