AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రపతి పాలనపై సుప్రీం కోర్టు వ్యంగ్యం..!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ పిటీషన్ విచారణ సమయంలో బిజేపీ నేతల విమర్శలకు వ్యంగ్యంగా స్పందించింది. దేశంలో న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు ఈ పిటీషన్ విచారణ సందర్భంగా స్పందించింది. కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందన్న విమర్శలకు ఇది కారణమవుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు వచ్చేస్తున్నాయని, అలాంటిది ఇప్పుడు బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి, సైన్యం మోహరించాలి అంటూ మాండమస్‌ రిట్‌ ద్వారా రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఆ తరువాత రాష్ట్రపతి పాలన కోసం ఆదేశాలు చేయడానికి నిరాకరించింది.

 

మరోవైపు.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు చూపుతున్న వైఖరిపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్‌, రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేకాధికారాలు కాలపరిమితిలో పని చేయాల్సిందేనని, లేకపోతే కోర్టులను ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణ చేస్తూ స్టే ఆదేశాలు కూడా ఇచ్చింది.

 

ఈ పరిణామాలపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే, అయితే పార్లమెంట్‌ భవనాన్ని మూసేయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్‌ శర్మ సైతం సుప్రీంకోర్టును విమర్శించారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కూడా సుప్రీంకోర్టు తీర్పులను తప్పుబట్టారు. ఆయన రాజ్యసభ సభ్యుల ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి గడువు విధించడం తగదు.

 

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలపై అణుశక్తిని ప్రయోగించడమే. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తున్నారు. కానీ వారిపై మాత్రం ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఎందుకంటే చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జికి సంబంధించిన నోట్ల కట్టల వ్యవహారంపై ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

కానీ బీజేపీ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదంటూ బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి తీవ్ర విమర్శలు గుప్పించాయి.

 

సుప్రీంకోర్టుపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే, గవర్నర్, రాష్ట్రపతికి నిర్దేశాలు జారీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక వర్గం సోషల్ మీడియాలో సుప్రీం కోర్టుని అవమానిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. దానిపై ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి తీవ్రంగా షేర్ చేస్తున్నారు.

ANN TOP 10