జపాన్ దిగ్గజ సంస్థ తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ షిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు పవర్ ట్రాన్స్ ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్ గ్రేడ్ చేయనుంది. కొత్త ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి. టీటీడీఐకి రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులతో ఇప్పుడు మూడో ఫ్యాక్టరీ రానుంది.