హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.
ఐటీ నాలెడ్జ్ హబ్ పై సచివాలయ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు లు అధికారులతో సమీక్షా సమావేశ నిర్వహించారు. హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాట్లపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభించడమే లక్ష్యమని వారు తెలిపారు.
హైదరాబాద్ మహా నగరం ప్రగతిని మరింత వేగవంతం చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కమిటీ నిర్ణయించింది. కాగా, ఐటీ నాలెడ్జ్ హబ్ కు కేటాయించిన 450 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్ సొసైటీలకు కేటాయించారు. వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూమి.. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల భూములు కలిపి ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.