గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు లక్ష్మీ ప్రియాంక పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆమె పేర్కొన్నారు. పార్టీలో తనను ఆదరించి, అవకాశాలు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
మరోవైపు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కోల్పోయిన వైసీపీ… జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉంది. తమ కార్పొరేటర్లు కూటమిలోకి వెళ్లకుండా వారిని వైజాగ్ నుంచి వేరే ప్రాంతంలోని క్యాంప్ కు కూడా తరలించింది. అవిశ్వాస తీర్మానానికి సమయం ఆసన్నం కావడంతో వారిని వైజాగ్ కు తీసుకొచ్చింది. వైజాగ్ చేరుకున్న తర్వాత వైసీపీకి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈ క్రమంలో మరెంతమంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దుతుగా వెళ్లిపోతారనే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.
ఇప్పటికే టీడీపీపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంటి నేతలు విమర్శలు గుప్పించారు. జీవీఎంసీలో మెజార్టీ లేకపోయినా మేయర్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని బొత్స మండిపడ్డారు. టీడీపీ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు.