AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ.!

రెండు రోజుల కింద‌ట ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.

 

ఈ క్రమంలో, ఈరోజు ఏపీ ప్ర‌భుత్వం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ చేసింది. గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ఆమోదం అనంత‌రం ఇందుకు సంబంధించిన గెజిట్‌ను న్యాయ‌శాఖ‌ జారీ చేసింది. ఈ మేర‌కు న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌తిభాదేవి ఉత్త‌ర్వులు ఇచ్చారు.

 

ఇక, ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌ ప్రకారం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇటీవ‌ల మీడియాకు తెలిపారు. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లోని 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 

గ్రూప్-1 (1% రిజర్వేషన్)

ఈ గ్రూపులో రెల్లి కులంతో పాటు మొత్తం 12 ఉపకులాలు ఉన్నాయి. వీటికి కలిపి 1 శాతం రిజర్వేషన్‌ను కేటాయించారు.

ఈ గ్రూపులోని ఉపకులాలు: బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ, ఘాసి, గొడగలి, మెహతర్, పాకీ, పామిడి, రెల్లి, సాప్రు.

 

గ్రూప్-2 (6.5% రిజర్వేషన్

మాదిగ కులంతో పాటు మొత్తం 18 ఉపకులాలను గ్రూప్-2గా వర్గీకరించారు. ఈ గ్రూపునకు 6.5 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.

ఈ గ్రూపులోని ఉపకులాలు: అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవాండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్‌ గరోడి, మాతంగి, సమగార, సింధోలు.

 

గ్రూప్-3 (7.5% రిజర్వేషన్)

మాల కులంతో పాటు అత్యధికంగా 29 ఉపకులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-3కి అత్యధికంగా 7.5 శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.

ఈ గ్రూపులోని ఉపకులాలు: ఆది ద్రవిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, మండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా

అయ్యలవార్, పంచమ.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10