AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా..?

త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

 

ప్రజల కోసం నిత్యం పోరాడే గాంధీ కుటుంబంలో తాను భాగమని అన్నారు. దాని కారణంగానే తనను, తన కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా ఛార్జీషీట్ దాఖలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ తమను ఎంతగా ఇబ్బంది పెడితే అంతలా తాము బలపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొని ముందుకు సాగుతామని వాద్రా అన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే వారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేస్తే, ఆ సంస్థలను ప్రజలు విశ్వసించరని ఆయన అభిప్రాయపడ్డారు. తాను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రజలు తనతో ఉన్నారని, త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 

ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. విచారణలో భాగంగా ఈడీ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలకు తాను 2019లోనే సమాధానం ఇచ్చానని తెలిపారు. మళ్లీ ఇప్పుడు అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

ANN TOP 10