ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
హీరోల అభిమానుల సోషల్ మీడియా పోరులో భాగంగానే రఘు అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడు ఐదు మొబైల్స్‌ను వినియోగించాడని, 14 మెయిల్ ఐడీలను ఉపయోగించి ‘ఎక్స్’లో ఖాతాలు తెరిచాడని వెల్లడించారు.
రఘు చేసిన పోస్టులను పరిశీలించామని, వాటిలో ఎక్కువగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.