ఒక్క చెట్టు కూడా కొట్టొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడేది లేదు. కంచ గచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టు మరోసారి క్లియర్ కట్ స్టేట్‌మెంట్స్ చేసింది. ఆ భూముల వివాదంపై స్టేటస్ కో కొనసాగుతుందని చెప్పింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఒక్క చెట్టును కూడా కొట్టొద్దని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఇరు పక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్ట్ సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. చెట్లు కొట్టేముందు.. 1996లో సుప్రీంకోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది జవాబు ఇస్తూ.. అనుమతులతోనే ఆ భూముల్లో ఉన్న పొదలు, జామాయిల్ తరహా చెట్లు తొలగించామని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ అనుమతి తీసుకోకుండా చెట్లును కొట్టేశారని తేలితే సీఎస్‌తో సహా సంబంధిత అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. సీఎస్‌ను కాపాడాలనుకుంటే, వంద ఎకరాలను ఎలా పునరుద్దరిస్తారో చెప్పాలని నిలదీసింది. పర్యావరణ పరిరక్షణలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం అన్ని పనులు ఆపేశామని.. భవిష్యత్‌లో పునరావృతం కానివ్వమని కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ HCUకు వెళ్లి భూములు పర్యవేక్షించిందన్నారు జస్టిస్ గవాయ్. రిపోర్టు కూడా సమర్పించినట్లు చెప్పారు. ఐతే ఆ రిపోర్ట్‌పై స్పందించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు లాయర్ కోరగా.. 4 వారాల సమయం ఇస్తూ విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
సీఎస్ అఫిడవిట్‌లో ఏముందంటే..
కంచ గచ్చిబౌలి భూముల కేసులో తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితమే అఫిడవిట్ కూడా వేశారు సీఎస్. గత విచారణలో సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భూములు ప్రభుత్వానివేనని, అటవీ భూములుగా నోటిఫై చేయలేదని వివరించారు. 20 ఏళ్లుగా ఆ భూమి న్యాయ వివాదంలో ఉన్నందున అది నిరూపయోగంగా ఉండటంతో చెట్లు పెరిగాయన్నారు. ఆ 400 ఎకరాల భూములతో HCUకు గానీ, అటవీశాఖకు గానీ ఎలాంటి సంబంధం లేదని సీఎస్ తన అఫిడవిట్‌లో వివరించారు.