రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ప్రారంభ దశలో భాగంగా, ఫ్రాన్స్ నుంచి మూడు అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. ఒక్కో రోబో విలువ సుమారు రూ. 2 కోట్లు కాగా, మొత్తం రూ. 6 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించినట్లు సమాచారం. త్వరలోనే ఈ రోబోలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు, సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాల్లో సంభవించే భారీ అగ్నిప్రమాదాల సహాయక చర్యల్లో వీటిని వినియోగించనున్నారు.
ఈ రోబోల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలవు. ఇందుకోసం వీటిని ప్రత్యేకమైన ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారుచేశారు. ప్రతికూల పరిస్థితుల్లో, అధిక వేడిని గ్రహించినప్పుడు, తనంతట తానే చల్లబరుచుకునే వ్యవస్థ (సెల్ఫ్ కూలింగ్) కూడా ఇందులో ఉంది.
రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని సురక్షితమైన దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. ముందు, వెనుక భాగాల్లో అమర్చిన కెమెరాలు, హీట్ సెన్సార్ల సహాయంతో దట్టమైన పొగలో కూడా లోపలి దృశ్యాలను, ఉష్ణోగ్రత తీవ్రతను ఆపరేటర్లు స్పష్టంగా గమనించవచ్చు. ఫైర్ టెండర్ లేదా సమీపంలోని హైడ్రెంట్లకు అనుసంధానించి, వీటి ద్వారా నీటిని లేదా ఫోమ్‌ను అధిక పీడనంతో వెదజల్లి మంటలను ఆర్పవచ్చు.
మానవ ప్రమేయం అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితుల్లో, ముఖ్యంగా తీవ్రమైన వేడి, భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రదేశాలు, రసాయన పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాల్లో ఈ రోబోలు కీలక పాత్ర పోషిస్తాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
“గతంలో భారీ అగ్నిప్రమాదాల సమయంలో మా సిబ్బంది తీవ్ర గాయాలపాలైన సందర్భాలున్నాయి. అధిక ఉష్ణోగ్రత, దట్టమైన పొగ వల్ల సిబ్బంది లోపలికి వెళ్లలేని సమయాల్లో ఈ రోబోలను పంపి, అక్కడి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు” అని ఓ అధికారి వివరించారు. ప్రమాదాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి కూడా ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు.