రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించని, రైతులకు నష్టం కలిగించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన కలెక్టర్ ఎస్. లక్ష్మీశ, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌తో కలిసి నేడు పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడు ప్రాంతాల్లో పర్యటించి, ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రి ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో అధికంగా కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాను పర్యటిస్తున్నట్లు మంత్రి రైతులకు తెలిపారు.
అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ, “నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ-ట్యాగ్ చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా అయినా ధాన్యం సేకరిస్తాం” అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లకు చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బకాయిలను కూడా తమ కూటమి ప్రభుత్వం చెల్లించిందని, మిల్లర్లకు అండగా నిలిచినప్పుడు వారు కూడా రైతులకు సహకరించాలని సూచించారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎంత ధాన్యం పండినా, లక్ష మెట్రిక్ టన్నులు అయినా, రెండు లక్షల మెట్రిక్ టన్నులు అయినా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళనకు గురై తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వానికి మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని, ట్రక్ షీట్ జనరేట్ అయిన 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన భరోసా కల్పించారు.
ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరదల కారణంగా దాళ్వా పంట ఆలస్యమైనందున, ఖరీఫ్‌లో నమోదైన ఈ-పంటను రబీకి మార్చేలా వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన విజ్ఞప్తి మేరకు తక్షణమే అధికారులను ఆదేశించి, ఆ వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు.