స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో, ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎస్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపుతో రెపో లింక్డ్ రేటు 8.25 శాతానికి చేరుకుంది. అలాగే, ఎక్స్టర్నల్ బెంచ్ మార్కు ఆధారిత లెండింగ్ రేటును కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇది 8.65 శాతానికి చేరింది.
సవరించిన వడ్డీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఈ నిర్ణయం ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా రుణాలు తీసుకునే వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు ఇతర రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
ఎస్బీఐ డిపాజిట్ రేట్లను కూడా సవరించింది. డిపాజిట్లపై సుమారు 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించింది. రూ. 3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 1-2 సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.70 శాతానికి చేర్చింది.
2-3 సంవత్సరాల కాల వ్యవధిపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గించింది. రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 180 రోజుల నుంచి 210 రోజుల కాలవ్యవధిపై 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి సవరించింది.