దేశంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి నిరసనగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు హింసాత్మక నిరసనలు చేస్తుండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తీరప్రాంతాల నగరాలు అప్రమత్తంగా ఉండాలని, అక్కడ గస్తీ చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది.
2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిలో ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ప్రధాన సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది అయిన లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణాని ఇటీవలే అమెరికా నుంచి భారత ప్రభుత్వం ఇండియాకు తీసుకువచ్చింది. అతడిని ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో మరోసారి దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించాయి. దాంతో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.అయితే ఆ ఉగ్రవాదులలో కొంతమంది సరిహద్దుల దాటి భారతభూభాగంలో ప్రవేశించగా.. మరికొందరు సముద్ర మార్గాన దేశంలోకి చొరబడే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఉగ్రదాడులు డ్రోన్లు, ఐఈడీ బాంబుల లాంటి భారీ పేలుడు చేసే పదార్ధాల వాడకంతో జరగవచ్చని, సముద్ర తీర ప్రాంతాల్లో మరింత నిఘా అవసరమని సూచనలు ఇచ్చింది. అంతేకాకుండా, రైల్వే వ్యవస్థపై కూడా ఉగ్రదాడుల ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. నిఘా సంస్థలు ప్రత్యేకంగా రైల్వే శాఖను కూడా హెచ్చరించాయి.
వక్ఫ్ చట్టంపై హింసాత్మక నిరసనలు
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనల నేపథ్యంలో ముగ్గురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మరణించగా, శనివారం జరిగిన కాల్పుల్లో మరొకరు మృతిచెందినట్టు సమాచారం. మరణించిన ఇద్దరిలో తండ్రి కొడుకులు ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ శాఖకు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ వెల్లడించారు. ముస్లింలు అధికంగా నివసించే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 118 మందిని అరెస్ట్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర బలగాల మోహరింపునకు హైకోర్టు ఆదేశాలు
వక్ఫ్ చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక రూపం తీసుకున్న నేపథ్యంలో.. కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిరసనాకారులను కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని, కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు నమోదైన జంగీపూర్ ప్రాంతంలో కేంద్ర బలగాలను తక్షణం దింపాలని స్పష్టంగా పేర్కొంది.
వక్ఫ్ చట్టం అమలుకాదు: ముఖ్యమంత్రి మమత బెనర్జీ హామీ
ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంగా తెలియజేశారు. “ప్రజలకు నా విజ్ఞప్తి – రాష్ట్రంలోని అన్ని మతాలవారూ శాంతి పాటించండి. ఎవరూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టించకండి. రాష్ట్రంలో ఏవైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే, ఆ ప్రభావం చివరకు ప్రజలపైనే ఉంటుంది. హింస ఏ వర్గానికి, మతానికి, కులానికీ మేలు చేయదు. ప్రతీ మనిషి జీవితం అమూల్యం, దాన్ని గౌరవించాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.