ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎంలు) హ్యాక్ అవుతాయంటూ యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. భారత ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ యంత్రాలు ఇంటర్నెట్ లేదా ఇన్‌ఫ్రారెడ్‌తో అనుసంధానించడం లేదని, సాధారణ కాలిక్యులేటర్ల విధంగానే పనిచేస్తాయని పేర్కొంది.
ఓట్లను తారుమారు చేసేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను హ్యాకింగ్ చేసే దుర్భలత్వానికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం రూపొందించిందని తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఈసీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కొన్ని దేశాలు ఇంటర్నెట్ తో సహా వివిధ ప్రైవేట్ నెట్‌వర్క్‌లతో సహా మల్టీ సిస్టమ్స్‌తో అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉందని ఈసీ తెలిపింది.
కానీ, భారతదేశం సరళమైన, ఖచ్చితమైన కాలిక్యులేటర్‌లా పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తోందని, ఇది హ్యాకింగ్ కు అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్, ఇన్‌ఫ్రారెడ్‌లతో అనుసంధానించడం లేదని ఈసీ తెలిపింది. ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలన పరీక్షను ఎదుర్కొందని, వాస్తవ పోలింగ్ కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాజకీయ పార్టీలు లెక్కింపు ముందు ఐదు కోట్లకుపైగా పేపర్ ట్రైల్ మెషిన్ స్లిప్ లను ధృవీకరించి, సరిపోల్చుతామని పేర్కొంది. కాగా, గతంలో ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంలను తొలగించాలని.. వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు. అప్పుడు నాటి ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్.. మస్క్ వాదనలకు కౌంటర్ ఇచ్చారు. మన ఈవీఎంల గురించి ఆయనకు తెలియదన్నారు. అందుకే, భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తి ఒక రోజులోనే ముగిసిందని.. అమెరికాలో మాత్రం నెలకంటే ఎక్కువ సమయం పడుతుందంటూ మస్క్ చెప్పారని తెలిపారు.