ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ కు అలవాటు పడిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే యోచనలో ఉంది. రానున్న ఆరు నెలల్లో ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు టీ ఫైబర్ ఇకపై తెలంగాణ నెక్ట్స్ జెన్ (T-NXT) టెక్నాలజీ పేరుతో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
బేగంపేటలోని సెంటర్ పాయింట్ భవనంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ‘టీ ఫైబర్ ప్రాజెక్టు కేవలం ఇంటర్నెట్ సేవలను అందించడానికి మాత్రమే పరిమితం కాదని.. దీని ద్వారా టెలిఫోన్, కంప్యూటర్, స్మార్ట్ టెలివిజన్ సేవలను కూడా ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 4 గ్రామాల్లోని 4 వేల ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేశామన్నారు. వీటిలో 336 మండలాల్లోని 7,187 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
సుమారు 45 వేల కిలోమీటర్ల పొడవున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్,టీ ఫైబర్ బిజినెస్ హెడ్ శ్రీ కుమార్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.