AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత..

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ తెల్లవారు జామున ఖమ్మంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి ఆయన స్వస్థలం. విస్తృతంగా మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం, విత్తనాలు- మొక్కలను పంచడం వల్ల వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణం, మొక్కల పెంపకం పట్ల ఆసక్తి కలిగింది. జీవితాంతం దాన్ని కొనసాగించారు.

 

80 సంవత్సరాల వయస్సులోనూ విసృతంగా మొక్కలను నాటారు. కోటికిపైగా మొక్కలను నాటారు. సామాజిక అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రచారకర్తగా వ్యవహరించారు. పర్యావరణ రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ తొలిసారిగా 1995లో తొలిసారిగా కృషి సేవ అవార్డును అందుకున్నారు.

2017లో పద్మశ్రీ అవార్డు ఆయనను వరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్‌ సైతం ఆయన అందుకున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా చెట్లు నాటడాన్ని ఆయనకు అలవాటు. ఎప్పుడూ ఆయన జేబిలో వివిధ జాతుల మొక్కలకు చెందిన విత్తనాలు ఉండేవి.

అనేక బంజరు భూములు.. ఆయన వల్ల హరిత వర్ణాన్ని సంతరించుకున్నాయి. మనిషి- ప్రకృతి ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో చెప్పడానికి వనజీవి రామయ్య జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నిస్వార్థ ఆయన సాగించిన సేవా కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయుడిని చేశాయి.

తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం, వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తోన్నారు.

ANN TOP 10