అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ అమెరికాపై సుంకాలను పెంచింది. యూఎస్ పై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రయోజనాలను అమెరికా అణచివేస్తుంటే… తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాము కూడా చివరి వరకు పోరాడతామని తెలిపింది.
మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు ఏకపక్షంగా ఉన్నాయని విమర్శించారు. ఎవరు ఎన్ని చేసినా తాము భయపడబోమని చెప్పారు. అమెరికాను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని అన్నారు. ప్రపంచ దేశాలకు వ్యతిరేకంగా వెళితే అమెరికా ఒంటరిగా మిగులుతుందని చెప్పారు. ఈ వాణిజ్య యుద్ధంలో చివరకు ఎవరూ గెలవరని అన్నారు.
అమెరికా విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవని జిన్ పింగ్ విమర్శించారు. చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అమెరికా ఏకపక్ష బెదిరింపులను కలసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు.