బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు తీవ్రమవుతుండటంతో, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో బంగారం ధరలు ఈరోజు రూ. 6 వేలకు పైగా పెరిగి రూ. 96,000 దాటింది.
ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 6,250 పెరిగి రూ. 96,450కి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం రూ. 96,430 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,223 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వాణిజ్య యుద్ధాల భయంతో పది రోజుల క్రితం ఔన్సు బంగారం ధర 3,200 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా కాస్త తగ్గింది.
అయితే ఇతర దేశాలపై టారిఫ్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై మాత్రం కొనసాగించారు. దీంతో అమెరికాపై చైనా 125 శాతం టారిఫ్ విధించింది. టారిఫ్ యుద్ధం ప్రభావం పసిడి ధరలపై పడుతోంది.