శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని అనితను ప్రశ్నిస్తూ దాడి చేశారు.
విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు స్కూలు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.