మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం. తనను 91వేల భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపడంతో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కలను నెరవేర్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్‌గా ఆసుపత్రి నిలిచేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.
దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా, దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవన నమూనాలు, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూడాలన్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని గడువు విధించారు.
1,15,000 చదరపు అడుగుల్లో ఆసుపత్రి భవన నిర్మాణం
చినకాకాని వద్ద 100 పడకల ఆసుపత్రికి కేటాయించిన 7.35 ఎకరాల్లో 1,15,000 చదరపు అడుగుల్లో అత్యంత విశాలంగా ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధికి రూ.52.20 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం జీ ప్లస్ వన్ విధానంలో ఆసుపత్రిని నిర్మిస్తుండగా భవిష్యత్తులో విస్తరించుకునే అవకాశం ఉంది. ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 3 ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్, మంత్రి నారా లోకేశ్ గారి సూచనల మేరకు తలసేమియా వార్డు, డీ అడిక్షన్ ఓపీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
యువగళం హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది అక్టోబర్ 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో మంగళగిరి ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంతగా కొట్లాడి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో నారా లోకేశ్ పేర్కొన్నారు. అన్నట్లుగా రాష్ట్రంలోనే మూడో భారీ మెజార్టీ సాధించడంతో మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల
1986లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురికావడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అనేక సంవత్సరాలుగా మంగళగిరి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలంటూ ప్రజలు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎంతోమంది పాలకులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేదు. మంత్రి నారా లోకేశ్ రాకతో ఆసుపత్రి కల సాకారం కానుంది. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం శిథిలం కావడం, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలను చినకాకానికి మార్చి వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని కేటాయించడం జరిగింది.
అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరి
దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో మూడువేల మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ అందించేందుకు త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. వీటితో పాటు చెరువులు, పార్క్‌లు అభివృద్ధి చేయనున్నారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నారు. ఎన్నికలకు ముందే మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 26 అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నారా లోకేశ్ ప్రజల మనస్సు గెలుచుకున్నారు.
