AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమిళనాడు నీట్‌ వ్యతిరేక బిల్లు తిరస్కరణ..

భారతదేశంలో వైద్యవిద్య కోసం ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. నీట్‌ పరీక్ష(NEET Exam) నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.

 

తమ ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ,, కేంద్ర ప్రభుత్వం నీట్‌ను ఉపసంహరించుకోలేదన్న ఆయన.. ఈ వ్యవహారంలో తమిళనాడు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ నెల 9వ తేదీన పార్టీలకతీతంగా ఎమ్మెల్యేందరితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

 

నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్షను క్లియర్‌ చేయలేని స్థితిలో పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడం వంటి ఘటనలు, ఇది ఒక తీవ్రమైన అంశంగా మారిందని అక్కడ భావిస్తున్నారు. కోచింగ్‌లకు వెళ్లే సామర్థ్యం లేని విద్యార్థుల పట్ల దీనిని ఒక శాపంగా భావిస్తున్నారు. సామాజిక న్యాయం దక్కాలంటే నీట్‌ వద్దనే నినాదంతో పోరాడుతూ వస్తోంది.

 

అందుకే నీట్‌ బదులు 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి తమిళనాడును అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించింది. అయితే, 2021-22 నుంచే అది పెండింగ్‌లో ఉంటూ వస్తోంది.

 

ఈ క్రమంలో.. కిందటి ఏడాది జూన్‌లో తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా నీట్‌ను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూడా. అయినప్పటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

 

తాజా ఎదురు దెబ్బపై స్టాలిన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రం మరోసారి అవమానానికి గురైందని అన్నారు. ‘‘కేంద్రం తమిళనాడు అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కానీ, మన పోరాటం మాత్రం ఆగదు. న్యాయ నిపుణులపై చర్చించి ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అంశం పరిశీలిస్తాం’’ అని స్టాలిన్‌ ప్రకటించారు.

 

మరోవైపు, తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌ కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోవైపు, కాంగ్రెస్‌, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా నీట్‌ను మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

 

ఇంతకు ముందే హిందీ భాషను తిరస్కరించడం, రాష్ట్ర సరిహద్దుల పునఃపరిశీలన (డీలిమిటేషన్) వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో, ఇప్పుడు నీట్‌ (NEET) పరీక్ష విషయంలో రాష్ట్రపతి తిరస్కారం తాజా వివాదంగా మారింది. ఈ పరిణామంతో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మరింత దిగజారే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

రాజకీయ నేపథ్యం

 

2024లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్న కీలక సమయంలో ఈ వివాదం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి అనుమతి నిరాకరించడం, రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలకు పెద్ద షాక్‌గా మారింది.

ANN TOP 10