దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. దీంతో లోక్ సభలో బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా.. ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది.
బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా వాడీవేడీ చర్చ నడిచింది. ఈ విషయంలోనే అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి తెర లేపారు. దాదాపు 12 గంటల పాటు సుధీర్ఘ చర్చ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. అనుకూలంగా 282, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు.
ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలు అందరికీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాడు వక్ఫ్ బిల్లును రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎగువసభలో ఈ బిల్లుపై చర్చకు 8 గంటల సమయాన్ని కేటాయించారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ.రాజా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రవేశపెట్టిన బిల్లును సమర్థించడానికి ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా బీజేపీలో లేరన్నారు. కానీ బీజేపీ మాత్రం మనకు లౌకికవాదాన్ని బోధిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రసంగ పాఠాన్ని జేపీసీ నివేదికతో పోల్చి చూడాలని సవాల్ చేశారు. అది సరిపోలితే తాను ఈ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.