మాజీ సీఎం జగన్ రాజకీయంగా కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం పార్టీ నేతల వేధింపుల పైన జగన్ తీవ్రంగా స్పందించారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మెజార్టీ సీట్లు సాధించామని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణమైన పార్టీ కేడర్ కు సెల్యూట్ చేసారు. అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్ వంటి కారణాలతో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. కానీ, ఇక నుంచి తానే స్వయంగా రంగంలో నిలుస్తానని జగన్ వెల్లడించారు.
కేడర్ కు సెల్యూట్
మాజీ సీఎం జగన్ కార్యకర్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో కార్య కర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని అంగీకరించారు. జగనన్న 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని.. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. ఇక నుంచి తానే కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు వస్తున్నానని వెల్లడించారు. కార్యకర్తకు అన్యాయం జరిగితే పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా ఎన్నికల్లో ప్రభుత్వం బెదిరింపులకు దిగినా.. కేసులు పెట్టినా పార్టీ కేడర్ ఎన్నికల్లో చూపిన తెగువకు జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు.
జగనన్న 2.0 లో ఇక
టీడీపీకి గెలిచే స్థానాలు లేకపోయినా.. దౌర్జన్యంగా గెలిచే ప్రయత్నాలు చేసిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైసీపీ గెలిచిందని చెప్పుకొచ్చారు. పోలసులను అడ్డుపెట్టి భయాందోళనల నడుమ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చూసిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసారని ఆరోపించారు. చంద్రబాబు మోసం క్లైమాక్స్ దశకు వచ్చిందని.. ప్రజల్లో ఎప్పుడూ లేని వ్యతిరేకత కనిపిస్తోందని వివరించారు. విశాఖలోనూ బలం లేకపోయినా అవిశ్వాసం పెట్టి అక్రమం గా కార్పోరేషన్ దక్కించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.