పేటలో రజనమ్మకు పేటరాప్ తప్పడం లేదా? ఆమె చుట్టూ ఇన్ని కేసులు మారు మోగుతున్నాయి.. కారణమేంటి? అధికారంలో ఉండగా.. రజనీ అన్నేసి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారా? హైకోర్టు తీర్పుతో మొత్తం తారుమారేనా? పేటలో అసలేం జరుగుతోంది? అక్కడి పార్టీ భవితవ్యమేంటి?
గెలిచిన తొలిసారే మంత్రి పదవి కొట్టిన రజనీకి సడెన్ స్టార్ గా పేరు
గెలిచిన తొలిసారే.. ఎమ్మెల్యే ఆపై మంత్రి పదవి కూడా కొట్టేసిన రజనీకి సడెన్ స్టార్ గా పేరుంది. ఎంత తక్కువ కాలంలో ఎదిగారో అంతే తక్కువ కాలంలో ఆమెపై అనేక రాజకీయ ఆరోపణలు. ఉన్న చోటు వదిలి గుంటూరు వెస్ట్ కి తట్టాబుట్టా సర్దుకెళ్లింది ఇందుకేనంటారు. అక్కడేదైనా గెలిచారా? అంటే అదీ లేదు.. వెళ్లినంత సేపు కూడా ఉండలేక పోయారు. ఆ వెంటనే రిటనై పోయారు. సరే ఇలాగైనా పేటలో ఏ పోరూ లేకుండా ప్రశాంతంగా ఉన్నారా అంటే అదీ లేదు.. ఆ ఆశ కూడా అడయాశలై పోతున్నాయట రజనీమేడంగారికి.
జగనన్న కాలనీ స్థల సేకరణలో రైతుల నుంచి డబ్బు వసూళ్లు
కాస్తయినా గ్యాప్ ఇవ్వండ్రా! అనే బ్రహ్మీ డైలాగ్ తో రజనీ మేడంపై మీమ్స్ ఒకటే పేలుతున్నాయట. కారణం ఆమెపై వరసగా నమోదవుతున్న ఫిర్యాదులు అలాంటివి మరి. జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ వ్యవహారమే తీసుకుంటే.. రైతుల నుంచి కమీషన్ల పేరిట డబ్బు వసూలు చేశారట. కొందరు కంప్లయింట్ చేయడంతో.. డబ్బు తిరిగి ఇచ్చేశారట. దీంతో వీరు కేసులు వెనక్కు తీసుకున్నారట. కొందరు మాత్రం పట్టు వదలడం లేదట. తమతో పాటు మరికొందరు బాధితులను కూడా పోగేస్తూ.. రజనీ మేడంగారిపైకి ఉసిగొల్పుతున్నారట. దీంతో ఏం చేయాలో అర్ధంగాని అగమ్య గోచర పరిస్థితికి రజనీ, ఆమె అనుచరులు జారుకుంటున్నారట. బురద తొక్కనేలా కాలు కడగనేల అన్నట్టు ఆనాడు లంచాలు తీస్కోనేలా- ఈనాడు అవస్థ పడనేలా? అంటూ.. పాతసామెతల్నే కొత్తగా చెప్పుకుంటున్నారట.
ఎన్నికల సమయంలో ఐదు కోట్లు తీస్కున్నారంటూ.. మల్లెల రాజేష్ ఆరోపణ
ఇవన్నీ ఇలాగుంటే.. ఎన్నికల టైంలో రజనీ తన దగ్గర ఐదు కోట్ల రూపాయల డబ్బు తీస్కుని మోసం చేసిందంటూ.. సొంత పార్టీ నేత మల్లెల రాజేష్ ఆరోపించారు. అప్పట్లో ఈ అంశం కలకలంగా మారింది కూడా. దీనిపై ఆనాడే రజనీ అనుచరవర్గం ఆందోళన చెందారు. ఈ ఆరోపణలు తన విజయానికి అడ్డు పడేలా ఉందని రజనీ వర్గం డైలమాలో పడింది కూడా. వీటన్నిటినీ తట్టుకుని.. గెలుస్తామంటూ ప్రగల్బాలు పలికినా.. ఓటమి తర్వాత అందరూ నవ్వుకున్నారట.
రజనీపై పిల్లికోటి అనే వ్యక్తి ఫిర్యాదుతో SC\ST కేసు నమోదు
ఇవన్నీ ఒక ఎత్తయితే.. రజనీపై పిల్లికోటి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందట. తనను స్టేషన్లు తీవ్రంగా వేధించారంటూ కోటీ చిలకలూరిపేట పీఎస్ లో కంప్లయింట్ చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు.. సీఐ రమేష్ పై కూడా కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు రజనీపై బాలాజీ స్టోన్ క్రషర్ కేసున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో నాడు విజలెన్స్ ఎస్పీగా చేసిన జాషువా, రజనీ బావమరిది గోపీనాథ్, పీఏ రామకృష్ణపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులతో సంబంధం లేదంటూనే హైకోర్టునాశ్రయించిన రజనీ
ఈ రెండు కేసులతో తనకెలాంటి సంబంధం లేదంటూ.. ఆమె మీడియా ముందు వీరావేశంగా ప్రకటించారు. కానీ, ఆ వెంటనే వెళ్లి.. హైకోర్టునాశ్రయించారు. ముందస్తు బెయిలు కోసం కోరారు. దీంతో రజనీ అనుచరవర్గంలో అలజడి మొదలైందట. ఇలా ఒకదాని వెంట మరొకటిగా.. కేసులు వెంటాడటంతో.. సతమతమై పోతున్నారట రజనీ. ఇటు తనపైనే కాక, తన అనుచరులపైనా కేసులు బుక్ అవుతుంటే.. ఉక్కిరిబిక్కిరిగా ఫీలవుతున్నారట. పైకి ధైర్యం ఎదుర్కుంటానని రజనీమేడం మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఆమె గజగజ ఒణికిపోతున్నారని అనుచరులే అంటున్నారట. తాను మాత్రమే కాక తమను కూడా పీకలోతు కేసుల్లో ఇరికించేస్తున్నారనీ.. వీరు వాపోతున్నారట. ఆనాడు ఆమె చెప్పినట్టల్లా చేయడమే తమకు చేటు తెచ్చిందని.. వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఇటీవల మర్రి పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీకి మరో దెబ్బ
ఆనాడు మర్రిని కాదని రజనీని నమ్మినందుకు అధినేత జగన్ కి కూడా గట్టిగానే శాస్తి జరిగిందని అందరూ అంటున్నారట. ఇటీవల మర్రి పార్టీకి రాజీనామా చేయడంతో.. పార్టీకి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బగా తయారైందట. ఇటు తనను నమ్ముకున్న వారినీ అటు పార్టీనే నమ్ముకున్నవారికీ రజనీ తీరని నష్టం కలగ చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారట. దీంతో ఈ ప్రాంతంలో ఫ్యాను పార్టీ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయన్న శబ్ధం వినిపిస్తోందట.
మర్రి కూడా లేక పోవడంతో దిక్కెవరంటూ కార్యకర్తల ఆందోళన
ప్రస్తుతం రజనీ, ఆమె అనుచరగణం హైకోర్టులో రెండు కేసుల్లో ఎలాంటి తీర్పు రాబోతుంది? అన్న ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట. ముందస్తు బెయిలుకు కోర్టు అనుమతిస్తే.. సరే సరి. లేకుంటే ఆమె విచారణకు హాజరు కావల్సి వస్తుందట. మరో కొత్త సమస్య ఏంటంటే.. ఒక వేళ రజనీని పోలీసులు అదుపులోకి తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటి? ఉన్న మర్రి రాజశేఖర్ కూడా లేక పోవడంతో.. తమకు దిక్కెవరంటూ బావురుమంటున్నారట ఫ్యాను పార్టీ కార్యకర్తలు.
పీఏ రామకృష్ణ అజ్ఞాతంలోకి.. మరిది గోపీ విదేశాలకు పరార్
రజనీమేడం లేకుంటే పోయారు ఆమె ప్రధాన అనుచరులైనా తమకు అండగా ఉంటారా? అని చూస్తే పీఏ రామకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లారట. ఇక మరిది గోపీనాథ్ విదేశాలకు చెక్కేశారట. దీంతో సగటు కార్యకర్తకు దిక్కేది అన్న ప్రశ్న తలెత్తుతోందట. లేటెస్టుగా రజనీపై చర్యలు తీసుకోవాలంటూ.. నవతరం పార్టీ నేత కంప్లయింట్ చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి, తనపై హత్యాయత్నం చేశారని ఆయన నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో అధికారంలో ఉండగా ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేక పోయారనీ. కనీసం ఇప్పుడైనా మాజీ మంత్రిపై చర్యలు తీస్కోవాలని ఈ పార్టీ నేత డిమాండ్ చేస్తున్నారట.
కోర్టు తీర్పుతో పేట రాజకీయాల్లో పెను మార్పులన్న సంకేతాలు
స్టోన్ క్రషర్ యజమాని బెదిరింపు కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసిన రజనీకి మరోమారు చుక్కెదురైనట్టు తెలుస్తోంది. ఇదే కేసులో రజనీ పీఏ రామకృష్ణ, మరిది గోపీ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లు కలిపి.. విచారించాలని కోర్టుకు కోరారు రజనీ లాయర్. అయితే తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. ఏది ఏమైనా ఈ కోర్టు తీర్పుతో పేట రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పేటలో ఇన్నాళ్లూ అధికారం చెలాయించిన ఈ మాజీ మంత్రికి ప్రస్తుతం పేటరాప్ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. మరి చూడాలి రజనీ భవితవ్యమేంటో.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఫ్యూచరేంటో అంటున్నారు పేటవాసులు.