AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. కోడి మాంసం తిని చిన్నారి మరణించినట్లు నిర్దారించారు. గుంటూరు జిల్లాలో ఈ మరణం నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైద్య ఆరోగ్య శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ లక్షణాల పట్ల అలర్ట్ చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించి నట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

 

తొలి మరణం

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ (ఎవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా/హెచ్‌5ఎన్‌1) మరణం నమోదైంది. పట్టణంలోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి అనే రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. గత నెలలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ చిన్నారి అక్కడ చికిత్స పొందుతూ గత వారం ప్రాణాలు విడిచింది. అయితే బర్డ్‌ఫ్లూ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు చిన్నారి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైనట్టు వైద్యాధికారులు నిర్దారణ చేసారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.

 

పరీక్షల్లో నిర్దారణ

మార్చి 16న ఈ బాలిక మరణించింది. కాగా, పూర్తి స్థాయిలో నమూనాలను పరీక్షించిన తరువాత అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిం చింది. చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మార్చి 16న మృతిచెందింది. అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్‌ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. ఇన్‌ఫ్లుయెంజా ఎ పాజిటివ్‌గా తేలింది.

 

మాంసం ముక్క తిని

తిరిగి మరో సారి నమూనాలకు 15న దిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్‌.. 24న స్వాబ్‌ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్‌5ఎన్‌1 వైరస్‌గా నిర్ధారించారు. కాగా, చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండురోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్యశాఖ జ్వర సర్వే చేసి, అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చింది. స్థానికంగా ఈ తరహా కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది. కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇవ్వగా, తిన్నదని, తర్వాతే జబ్బు పడిందని పాప కుటుంబ సభ్యులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10