రంగారెడ్డి మండలం శేరిలింగంపల్లి మండలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆవరణంలో ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతోనే ఇప్పుడు అసలు వివాదం మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ 400 ఎకరాల ల్యాండ్ ను అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసీ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. అయితే, ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి అని జీవవైవిద్యం ఉన్న వీటి జోలికి ఎవరూ రావొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ భూముల్లో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు కూడా ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని, భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రగలిపోతున్నాయి. టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని రెండు రోజుల క్రితం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో అక్కడ ఉధ్రిక్తత వాతావరణ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు కూడా పెట్టారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లో ఉన్న ఈ 400 ఎకరాల భూమిని 2004లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఐఎంజీ అకడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఐఎంజీ అకడమీస్ అదే సమయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే, సుదీర్ఘ కాలం తర్వాత 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా 2024 మే 3న ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తరువాత.. టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.
ఈ క్రమంలోనే ఈ 400 ఎకరాల భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)తో ఎలాంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తేల్చి చెప్పిందని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. కాదు.. ఆ భూమి హెచ్‌సీయూదే అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
ఈ వివాదంపై ఇప్పటి పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా, దీనిపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజు కూడా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఈ విధ్వంసం అసలు మంచిది కాదు. ప్రకృతిని నాశనం చేయడం, అడ్డొచ్చిన విద్యార్థులను హింసించడం ఏ విధంగా సరైంది కాదు. ఇలాంటి దారుణమైన చర్యకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు, పౌరులకు సపోర్టుగా నిలబడుతున్న. మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి. ముందుండి నడవాలి’ అని నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.