తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. సిట్ విచారణలో ఆయన కీలక వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అంతా ఆనాటి బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతో జరిగిందని చెప్పారట. దీంతో బీఆర్ఎస్ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకోనుంది.
దాదాపు ఏడుగంటలపాటు ఉక్కిరి బిక్కిరి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చులా మారింది. ఈ కేసులో నిందితుడు శ్రవణ్‌రావుని దాదాపు ఏడు గంటలపాటు విచారించింది సిట్. ఇన్వెస్టిగేషన్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో నలుగురు సభ్యుల టీమ్ ఆయన్ని ఆరేడు గంటలపాటు విచారించింది. అధికారులు సూచించిన డాక్యుమెంట్లతో ఏప్రిల్ రెండున మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రత్యర్థులే టార్గెట్‌గా అడుగులు వేసినట్టు శ్రవణ్‌రావు విచారణలో చెప్పారట. ఇందులోభాగంగానే కాంగ్రెస్, బీజేపీ నేతల వివరాలు సేకరించి అప్పటి ఎన్ఐటీ స్పెషల్ ఆపరేషన్స్ చీఫ్‌కు అందించానని ఒప్పేసుకున్నాడట. ప్రత్యేక గదిలో శ్రవణ్‌రావును అధికారులు విచారించారు. ఆయన చెప్పినదంతా వీడియో రికార్డింగ్ చేశారు.
మరో నిందితుడు ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్ ఆధారంగా చాలా ప్రశ్నలు రైజ్ చేశారట. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు-ప్రణీత్‌రావు సంబంధాలపై ఆరా తీశారు. ఎస్‌ఐబీ లాగర్ రూమ్ హార్డ్‌డిస్క్‌ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా శ్రవణ్‌రావును ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఎస్‌ఐబీకి ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి కారణాలేంటి? అప్పటి పెద్దలు, కొందరు పోలీస్ అధికారులు తాము చేపట్టిన పొలిటికల్ సర్వే ద్వారా సమాచారం అడిగితే ఇచ్చినట్టు చెప్పారని సమాచారం. మాజీ మంత్రులతో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీశారు. ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరింది అనే కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం.
తొలుత సిట్ అధికారుల ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేశారట శ్రవణ్‌రావు. మధ్యాహ్నం భోజనం తర్వాత వాట్సాప్ మెసేజ్‌లు, స్క్రీన్ షాట్లను ముందు పెట్టి ప్రశ్నించడంతో మొత్తం విషయాలు బయటపెట్టారని సమాచారం. 2023 ఎన్నికలతోపాటు గత ప్రభుత్వం ఎస్‌ఐబీ ఆధ్వర్యంలో రాజకీయ, వ్యాపారవేత్తల డబ్బు తరలింపుపై ఎలాంటి నిఘా పెట్టారనే దానిపై కీలక సమాచారం ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
బుధవారం మరోసారి విచారణ
కొన్ని డాక్యుమెంట్లకు సంబంధించి పత్రాలను ఏప్రిల్ 2న మళ్లీ విచారణకు తీసుకురావాలని చెప్పారట అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ అధికారులు ఈ నెల 26న శ్రవణ్‌రావు ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చారు. దీంతో రెండురోజుల కిందట ఆయన అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చారు.
శ్రవణ్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ ఉండడంతో దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారట. సుప్రీంకోర్టు ఆదేశాల గురించి చెప్పడంతో అధికారులు విడిచిపెట్టారు. ఈ క్రమంలో సీబీఐ నుంచి శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం వచ్చింది. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రవణ్‌రావు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.