హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల టైమింగ్స్ మారాయి. ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు సిటీవాసులు మెట్రోలో ఎక్కువగా జర్నీ చేస్తున్నారు. దీంతో మెట్రోలో రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా టైమింగ్స్‌లో మార్పులు-చేర్పులు చేసింది.
ఏప్రిల్ ఒకటి నుంచి టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు బయలు దేరే సమయాన్ని పొడిగించింది. ప్రస్తుతం టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండేది. ఏప్రిల్ 1 నుంచి 11. 45 నిమిషాలకు బయలుదేరనుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళలో మార్పులు జరిగినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు నడుస్తున్న మెట్రో రైలు సేవలు, ఏప్రిల్ ఒకటి నుంచి రాత్రి 11.45 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మారిన టైమింగ్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే అమల్లో ఉంటా యన్నారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైలు ఉదయం 7 గంటలకు మొదలుకానుంది.
విద్యార్థులకు మాత్రమే ఆఫర్
మరోవైపు గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలీడే ఆఫర్, ఆఫ్ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో (ఈనెల చివరి) ముగియనుంది. అలాగే 20 ట్రిప్పులు మనీ చెల్లించి 30 ట్రిప్పులు పొందేందుకు వీలు కల్పించే విద్యార్థుల పాస్ ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు అంటే మరో ఏడాది పొడిగించారు. దీనిపై హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది.
ఇకపై రేటింగ్ ఇవ్వచ్చు
మరోవైపు T-Savaari పేరిట మొబైల్ అప్లికేషన్, హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు స్టార్ రేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే అభిప్రాయాలను చెప్పవచ్చు. ఈ యాప్ నుండి నేరుగా వినియోగదారులు QR టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి అనుమతిస్తుంది.
రియల్ టైమ్ పరిస్థితిని ప్రదర్శిస్తుంది. వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగదారులు QR టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు స్టేషన్‌లను సులభంగా ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కొత్త రివార్డ్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టింది. వినియోగదారులు లాయల్టీ పాయింట్లను సంపాదించడానికి, రీడీమ్ చేయడానికి అనుమతిస్తుంది.