AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్ సభలో ఇమ్మిగ్రేషన్ బిల్లు చర్చలో అమిత్ షా..!

పర్యాటకులుగా, విద్య, ఆరోగ్యం, సంరక్షణ, వ్యాపారం కోసం భారత్‌కు రావాలనుకునే వారిని తమ ప్రభుత్వం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, భారత దేశానికి హాని కలిగించే ప్రమాదకరమైన వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్, ఫారనర్స్ బిల్లు 2025పై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా పాల్గొని, మాట్లాడారు. ఇండియాలోకి దురుద్దేశంతో వచ్చే వారిని మోడీ ప్రభుత్వం ఆహ్వానించబోదని తేల్చి చెప్పారు. అందరినీ తెచ్చి పెట్టుకోవడానికి ఇండియా ఏమీ ధర్మసత్రం కాదని తెలిపారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించబోమని, దేశాభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా వస్తే వారిని ఎప్పుడూ స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

 

ఇమ్మిగ్రేషన్, ఫారనర్స్ బిల్లు 2025 దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. ఆరోగ్యం, విద్యా రంగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇండియాను సందర్శించే ప్రతీ విదేశీయుడి గురించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

 

బంగ్లాదేశీయులు, మయన్మార్ నుంచి రోహ్యింగాలు.. భారత దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభం కోసం దేశంలో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. దీని వల్ల దేశం సురక్షితంగా లేకుండా పోతుందని, చొరబాటుదారులు దేశంలో అశాంతిని సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సహాయపడుతుందన్నారు.

 

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం తగినంత భూమి ఇవ్వకపోవడం వల్లే ఇండో-బంగ్లా సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కంచె వేసే ప్రక్రియ మొదలైనప్పుడల్లా అధికార టీఎంసీ పార్టీ కార్యకర్తలు గూండాయిజానికి దిగుతున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రభుత్వం చొరబాటుదారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల 450 కిలోమీటర్ల మేర కంచె పనులు పూర్తి కాలేదని అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో కంచె వేస్తామని చెప్పారు.

 

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారనర్స్ బిల్లు 2025 ప్రకారం ఇండియాలోకి ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి నకిలీ పాస్‌పోర్ట్, వీసాను ఉపయోగిస్తున్నట్లు తేలితే ఏడేళ్ల జైలు శిక్ష మరియు రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం హోటల్స్, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు విదేశీయుల గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.

ANN TOP 10