మల్టీప్లెక్స్ లేదా మాల్స్ కు వెళ్తున్నామంటే అక్కడ షాపుల్లో ఉండే రేట్ల కంటే వాటి పార్కింగ్ లో వాహనాలకు విధించే ఛార్జీలు చూసి వాహనదారులు బెంబేలెత్తుతుంటారు. దీంతో ఈ వివాదం ప్రతీ రాష్ట్రంలోనూ, ప్రతీ మల్టీప్లెక్స్, ప్రతీ మాల్ లోనూ ఉంది. దీనిపై వినియోగదారుల ఫోరాలు, కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో పార్కింగ్ పీజులపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో ఉన్న పార్కింగ్ స్ధలాల్లో వాహనాల పార్కింగ్ కు తొలి అరగంట పాటు పూర్తి ఉచితంగా నిర్ణయించారు. ఆ తర్వాత మాత్రమే కొన్ని షరతులతో ఆయా మల్టీప్లెక్స్ లు, మాల్స్ పార్కింగా్ ఛార్జీలు విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ షరతుల్లో ఆయా మల్టీప్లెక్స్ లలో ఉండే సినిమా థియేటర్లలో సినిమాలకు వెళ్లిన వారు టికెట్ చూపిస్తే ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు.