AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సీరియస్..! బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలని పిలుపు..

యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బెట్టింగ్ భూతాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు నడుంబింగించాలని కోరారు.

 

బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సీరియస్

 

గత కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది యువత ఈ యాప్స్ కు ఊబిలో చిక్కుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరికొంత మంది లోన్స్ యాప్స్ ద్వారా అప్పు చేసి మరీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. చివరకు ఉన్నడబ్బులన్నీ కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం కనిపించక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే, ఈ దుర్మార్గపు యాప్స్ ను పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ యాప్స్ ప్రమోషన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక యువతను బెట్టింగ్ భూతం వైపు ఆకర్షించేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆయన సూచన మేరకు రీసెంట్ గా యూట్యూబర్స్ లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్‌ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి.

 

హర్ష సాయిపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

 

అటు తాజాగా యూట్యూబర్ హర్ష సాయి పైనా సజ్జనార్ సీరియస్ గా స్పందించారు. హర్ష సాయికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా షేర్ చేశారు. ఇందులో హర్ష బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు అనుకూలంగా మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి” అని పిలుపునిచ్చారు.

 

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలని పిలుపు

 

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలంటూ నెటిజన్లు సజ్జనార్ పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను అరికట్టేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. “బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందన బాగుంది. బెట్టింగ్ మీద అవగాహన కల్పించే వీడియోలను రూపొందించేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఇలానే ముందుకు సాగండి. ఈ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయండి. మనమంతా కలిసి అనేక మంది ప్రాణాలు కాపాడుదాం” అని పిలుపునిచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10