డీఆర్ఐ కస్టడీలో తనను అధికారులు ప్రశ్నలతో మానసికంగా వేదనకు గురి చేశారని ప్రముఖ కన్నడ నటి రన్యా రావు తెలిపారు. దుబాయ్ నుండి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యా రావు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు కోర్టులో విచారణ జరిగింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కస్టడీలో తనను మాటలతో వేధించారని ఆమె కోర్టుకు తెలిపారు. తనను కొట్టలేదని, కానీ బెదిరించారని తెలిపారు. దీంతో తాను మానసికంగా వేదనకు గురయ్యానని చెప్పారు.
కస్టడీలో రన్యా రావును ఏ రకంగానూ వేధింపులకు గురి చేయలేదని దర్యాఫ్తు అధికారి కోర్టుకు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వడం లేదని, మౌనంగా ఉంటున్నారని చెప్పారు. ఆధారాలు చూపించి అడిగినా, సమాధానం రావడం లేదని తెలిపారు. రన్యా రావు కోర్టు వద్దకు రాగానే ఏం మాట్లాడాలో తన న్యాయవాదులు చెప్పారని, దర్యాఫ్తు ప్రక్రియను తాము రికార్డు చేశామని కోర్టుకు తెలిపారు.
మాటలతో వేధించిన అంశంపై మీ న్యాయవాదులు పిటిషన్ ఎందుకు వేయలేదని కోర్టు రన్యా రావును ప్రశ్నించింది.
దర్యాప్తుకు తాను సహకరిస్తున్నానని, కానీ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి పేపర్లపై సంతకాలు చేయమని ఒత్తిడి చేస్తున్నారని రన్యా రావు వాపోయారు.
భయపడాల్సిన అవసరం లేదని, ఏమైనా ఆందోళనలు ఉంటే మీ లాయర్లతో చెప్పి పిటిషన్ వేయవచ్చునని సూచించారు. విచారణ అనంతరం రన్యా రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించారు.